ఇషాంత్‌ శర్మ కూడా అవుట్

ఇషాంత్‌ శర్మ కూడా అవుట్

గాయం కారణంగా మరో ప్లేయర్‌ ఐపీఎల్‌ టి20 టోర్నమెంట్‌ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే మిచెల్‌, భువనేశ్వర్‌ కుమార్, అమిత్‌ మిశ్రా తప్పుకోగా… తాజాగా వీరి సరసన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు బౌలర్, భారత ఆటగాడు ఇషాంత్‌ శర్మ చేరాడు. పక్కటెముకల్లో గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఇషాంత్‌ అందుబాటులో ఉండటంలేదని ఢిల్లీ క్యాపిటల్స్‌ తెలిపింది.

ఇప్పటివరకు ఢిల్లీ జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడగా… 32 ఏళ్ల ఇషాంత్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే బరిలోకి దిగాడు. ఇషాంత్‌ తన 4 ఓవర్ల కోటా వేసి 26 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేదు. కెరీర్‌లో 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్‌ సకాలంలో కోలుకుంటే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది.