ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకు పడుతోంటే మరోవైపు హమాస్ వారిపై ప్రతిదాడులకు తెగబడుతోంది. గాజా యుద్ధభూమిలో హమాస్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తన సైనికులను కోల్పోతోంది. శుక్రవారం నుంచి దక్షిణ, మధ్య గాజాలో 14 మంది సైనికులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ సైనికుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇది కఠినమైన ఉదయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని అన్నారు. అయితే ఈ పోరాటాన్ని కొనసాగించడం తప్ప తమకు వేరే మార్గం లేదని నెతన్యాహు ఓ ప్రకటనలో తెలిపారు. చివరి వరకు పూర్తి శక్తితో పోరాడతామని, హమాస్ నిర్మూలన, బందీలకు విముక్తి, గాజా ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పుగా ఉండదని నిర్ధారించుకునేవరకు ఇది సాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.