ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌పై ఆ దేశం ప్రతిదాడులు ముమ్మరం చేసింది. అకస్మాత్తుగా తమపై ముప్పేట దాడికి దిగుతున్న ముష్కరులను ఎక్కడికక్కడే మట్టుబెడుతోంది ఇజ్రాయెల్ సైన్యం. ఇప్పటివరకు తమ దేశంలోకి చొరబడిన 1,500 మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలోనే హమాస్ మిలిటెంట్లు చొరబడ్డ ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది.
గాజాతో సరిహద్దు ప్రాంతం పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 900 మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. మరో 2,600 మందికిపైగా గాయాలయ్యాయని తెలిపింది. పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లినట్లు పేర్కొంది.
హమాస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు మరోవైపు 3 లక్షల మంది రిజర్వ్ బలగాలను ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. ఓవైపు వైమానిక దాడులతో గాజాను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే మరోవైపు హమాస్ మిలిటెంట్లను ఏరి పారేసేందుకు గాజాలోకి సైన్యంతో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తమ దేశంపై దాడికి దిగి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని.. యుద్ధం మొదలు పెట్టింది హమాస్ కానీ.. ముగించేది మాత్రం ఇజ్రాయెలేనని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.