ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం

పారిస్, సింగ్‌పూర్‌ వంటి వాటిని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయేల్ టెల్ అవీవ్ నిలిచింది. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని భారీగా పెరగడానికి కారణమయ్యిందని సర్వే తెలిపింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ చేపట్టిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈఐయూ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి టెలి అవీవ్ తొలిసారి మొదటి స్థానంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లోని వస్తువులు, సేవలను ధరలను అమెరికా డాలర్లతో సరిపోల్చి జీవన వ్యయ జాబితాను ఈఐయూ రూపొందించింది.అమెరికా డాలర్‌తో పోల్చితే ఇజ్రాయేల్ కరెన్సీ షీకేల్ బలంగా ఉండటం టెలి అవీవ్‌కు కలిసొచ్చింది. ఇదే సమయంలో రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈ జాబితాలో టెల్ అవీవ్ తర్వాత పారిస్ , సింగ్‌పూర్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో జ్యూరిచ్ , హాంకాంగ్, న్యూయార్క్ ఆరో స్థానంలో, జెనీవా ఏడో స్థానంలో నిలవగా.. కొపెన్‌హెగన్  ఎనిమిది, లాస్ ఏంజెల్స్ తొమ్మిది, ఒసాకా  పదో స్థానంలో నిలిచాయి.

గతేడాది పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉండటం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబరులో సమాచారాన్ని సేకరించిన ఈఐయూ.. సరుకు రవాణా, నిత్యావసరాల ధరలు స్థానిక కరెన్సీ ప్రకారం సగటున 3.5 శాతం పెరిగినట్టు తెలిపింది. ఐదేళ్లలో ఎన్నడూలేనివిధంగా అత్యంత వేగంతో ద్రవ్యోల్బణం పెరిగినట్టు గుర్తించింది.

కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి విధించిన ఆంక్షల ప్రభావం వస్తువుల సరఫరా, ధరల పెరుగుదలపై ఉందని ఈఐయూ హెడ్ ఉపాసన దత్ తెలిపారు. ఈ ఏడాది ఇండెక్స్‌లో ప్రత్యేకంగా పెట్రోల్ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఇక, ప్రపంచంలో జీవన వ్యయం అత్యంత చౌవకైన నగరంగా సిరియా రాజధాని డమాస్కస్ నిలిచింది.