గాజా పట్టీలో ఇజ్రాయెల్ దాడులు 21వ రోజుకు చేరాయి. ఈనెల 7వ తేదీన హమాస్ జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర వైమానిక దాడుల్లో 7వేల మందికిపైగా పాలస్తీనా ప్రజలు చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ దాడుల్లో ముగ్గురు హమాస్ కమాండర్లు చనిపోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్ భూతలదాడులు మొదలుపెట్టడంతో….గాజాలోని ఏప్రాంతం కూడా సురక్షితం కాదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో పౌరులు, పౌరులకు చెందిన మౌలిక సదుపాయాలు లక్ష్యంగా జరిగే హింసను, ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు అరబ్ దేశాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు జోర్డాన్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, కువైట్, ఈజిప్ట్, మొరాకో దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణకు రాజకీయ పరిష్కారం జరగపోవటం వల్లనే ఇజ్రాయెల్ , పాలస్తీనా ప్రజలు పదే పదే హింసాత్మక చర్యలకు గురవుతున్నారని పేర్కొన్నాయి.