బెంగళూరుతో పాటు అంతే వేగంగా ఐటీ విస్తరిస్తున్న నగరం మన హైదరాబాదే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నగరం చుట్టూ ఐటీని విస్తరించాలని నడుం బిగించిందట..
ఇప్పటికే ఆదిభట్లలో పరిశ్రమలను తెలంగాణ సర్కారు విస్తరించింది. అందులో టీసీఎస్ – సహా ప్రముఖ ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. తాజాగా తెలంగాణ సర్కారు మహేశ్వరం – శంషాబాద్ కు కూడా ఐటీని విస్తరించాలని యోచిస్తున్నాయట.. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
దేశంలో ఐటీ ఎగుమతులు 9శాతం మాత్రమే. అదే తెలంగాణలో ఐటీ ఎగుమతులు 26శాతానికి మించి ఉన్నాయి. తెలంగాణ ఐటీ ఎగుమతులు గత ఏడాది 1.09 లక్షల కోట్లకు చేరడం విశేషం. బెంగళూరు తర్వాత ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
ఇక మొత్తం ఐటీని హైదరాబాద్ కే పరిమితం చేయకుండా కరీంనగర్ – వరంగల్ – ఖమ్మం – నిజామాబాద్ – మహబూబ్ నగర్ లోనూ ఐటీ టవర్స్ ను నిర్మించాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే కరీంనగర్ లో ఐటీ టవర్ నిర్మాణం జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణ సర్కారు ఉపాధి – పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టింది. ఇటీవల 30 కంపెనీలు ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి తాజాగా దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 647 ఐటీ కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఐటీని నగరం మొత్తం విస్తరిస్తే ఐటీతోపాటు దాని అనుబంధ రంగాలు పెరిగి హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు.