టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పిదాలు మీద తప్పిదాలు చేస్తునే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. కనీసం టీ20 సిరీస్‌ను అయినా సాధించి పరువు దక్కించుకుంటుందా అని సగటు ప్రేక్షకుడు వేచి చూస్తుంటే, కోహ్లి మాత్రం తన వ్యూహాల్లో పసలేకుండా ముందుకు వెళుతున్నాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రాను పక్కను కూర్చోపెట్టాడు. ఒకవేళ ప్రయోగాలు ఏమైనా చేయాలనుకుంటే ఒక సిరీస్ ఆరంభంలో ఎవరూ చేయరు. కానీ కోహ్లి మాత్రం దానికి భిన్నంగా ఆలోచించాడు.
బుమ్రాను రిజర్వ్ బెంచ్‌లో కూర్చో బెట్టి పటిష్టమైన ఆసీస్‌తో తొలి టీ20కి సై అన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో బుమ్రా ఎంతటి కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే. ముంబై టైటిల్ గెలవడంలో బుమ్రా ముఖ్య భూమిక పోషించాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో బుమ్రా అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు సాధించాడు. మరి అటువంటి పేసర్‌ను పక్కకు పెట్టడానికి కోహ్లికి ఏమి కారణం కనబడిందో అతనికే తెలియాలి. ఇది కచ్చితంగా కోహ్లి విమర్శల పాలయ్యే నిర్ణయమే.
వన్డే సిరీస్‌లో కూడా సైనీకి అవకాశం కల్పించి కోహ్లి తప్పిదం చేశాడు. తొలి వన్డేలో ఫెయిల్ అయిన సైనీని మళ్లీ రెండో వన్డేకు కూడా ఎంపిక చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఇప్పుడు బుమ్రా స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించాడు కోహ్లి. మ్యాచ్ గెలిస్తే ఎటువంటి విమర్శలు రాకపోవచ్చు. ఒకవేళ ఓడిపోతే మాత్రం కోహ్లి నిర్ణయంపై విమర్శలు వస్తాయి. వర్క్ లోడ్ ఎక్కువతుందని బుమ్రాకు రెస్ట్ ఇచ్చామని టాస్ సమయంలో కోహ్లి చెప్పాడు. ఇది కేవలం టీ20 సిరీస్.
ఇందులో ఒక బౌలర్ నాలుగు ఓవర్లకు మించి వేయడు. అటువంటప్పుడు సుదీర్ఘమైన ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రాను వర్క్ లోడ్ పేరుతో పక్కకు పెట్టామనే కారణాన్ని ఎంతవరకూ ఒప్పుకోవాలి. ఇక చహల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు. తొలి టీ20లో ఆఖరి ఓవర్‌లో జడేజా హెల్మెట్‌కు బంతి తగలడంతో అతను బరిలోకి దిగలేదు. దాంతో చహల్ ఆ స్థానంలో వచ్చాడు. అసలు ముందు ప్రకటించిన జట్టులో చహల్‌కు చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది. కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా చహల్ సేవల్ని వినియోగించుకోవడం ఒక మంచి పరిణామం కాగా, మరి బుమ్రాను పక్కకు పెట్టడం మాత్రం కోహ్లి చేసిన పొరపాటుగానే చెప్పాలి.