ఒంగోలు మాజీ ఎంపీ, టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన ‘మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ’లపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) దాడులు జరుగుతున్నాయి. చెన్నై టీనగర్ లోని మాగుంట కంపెనీల కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో, చెన్నైలోని శ్రీనివాసులు రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా చెన్నైలో నెల్లూరుకి చెందిన సవేరా హోటల్ లోని ప్రైవేట్ లాకర్లలో పెద్ద ఎత్తున బంగారం, నగదు నిల్వలు దాచిపెట్టినట్టు ఐటీ అధికారులకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.
నెల్లూరుకు చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆ హోటల్ లోని ప్రైవేట్ లాకర్లలో డబ్బు, బంగారం భద్రపరిచారని భావిస్తున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల దాడుల్లో మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ దాడుల్లో భాగంగా రూ.55 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పొందిన కాంట్రాక్టులు, చెల్లించిన పన్ను మధ్య వ్యత్యాసం ఉండటంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. అలాగే దాడుల నేపథ్యంలో ఆఫీసులో కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్ లు, డిస్క్ లను ఐటీ అధికారులు జప్తు చేశారు. ప్రస్తుతం మిగిలిన ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.