Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా ట్రంప్ గురించి తెలుసుకోడానికి భాగ్యనగర యువత బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె ఏ లక్ష్యంతో ఈ టూర్ కి వస్తున్నారో తెలుసుకోవడం కన్నా ఇవాంకా వ్యక్తిగత జీవితం, అలవాట్ల మీద ఇండియన్ యూత్ ఇంటరెస్ట్ చూపుతోంది. ఆ కోవలో వారిని విశేషంగా ఆకర్షిస్తోంది ఆమె లవ్ స్టోరీ.
ఇవాంకా, జారెడ్ కుశ్నెర్ పెళ్లి వెనుక ఓ వెరైటీ ప్రేమ కధ వుంది. ఇది జగపతి బాబుకు హీరోగా టర్నింగ్ పాయింట్ అయిన పెద్దరికం సినిమా టైపు లో ఉంటుంది. ఇవాంకా అప్పట్లో తండ్రి తరపున ఆయనకు వున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసుకునే వారు . అటు కుశ్నెర్ కూడా ట్రంప్ కి వ్యాపార పరంగా పోటీ ఇస్తున్న ఇంకో రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని. ఈ ఇద్దరూ వ్యాపార పరంగా బాగా పోటీ పడే వాళ్ళు. ఆ సందర్భంలో రెండు కంపెనీల మధ్య కొన్ని విభేదాలు కూడా ఉండేవి. వీటిని పరిష్కరించడానికి అన్నట్టు ఓ కామన్ ఫ్రెండ్ వీరిద్దరి మధ్య ఓ బిజినెస్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్దరికం సినిమాలో లాగా ఇద్దరూ ఒకరిపై ఇంకొకరు వ్యాపార ఆధిపత్యం కోసమే ఈ విందు సమావేశానికి వచ్చారు. కానీ జరిగింది వేరు. ఒక్క మీటింగ్ అనుకున్నది కాస్త చాలా ప్రైవేట్ మీటింగ్స్ దాకా వెళ్ళింది. పోటీ స్థానంలో ప్రేమ పుట్టింది.
అయితే ఇద్దరు కోటీశ్వరుల బిడ్డల ప్రేమకు ఏమి అడ్డు ఉంటుంది అనుకుంటే పొరపాటే. వీరి ప్రేమకు కూడా ఓ ఆటంకం వచ్చింది. ఓ సారి బ్రేక్ అప్ కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఇవాంకా చూపిన చొరవతో ఆ సమస్య పరిష్కారం అయ్యింది. ఇవాంకా క్రిస్టియన్ అయితే కుశ్నెర్ యూదుడు. వీరి పెళ్ళికి మతం అడ్డు వచ్చింది. కుశ్నెర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఇవాంకా పెద్ద మనసుతో మతం మార్చుకుంది. దాంతో పాటే కొన్ని అలవాట్లు మార్చుకుంది. మొత్తానికి ప్రేమలో పెద్దరికంగా వ్యవహరించి పెళ్లిదాకా వచ్చింది.