సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 14వ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. 7 మ్యాచ్‌లాడి 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడేజా ప్రదర్శనను ఎప్పటికి మరిచిపోలేం. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 28 బంతుల్లోనే 62 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ 3 కీలక వికెట్లు తీయడంతో పాటు మెరుపు రనౌట్ చేసి తానెందుకు ఆల్‌రౌండర్ అనేది మరోసారి చూపించాడు.
ముఖ్యంగా బ్యాటింగ్ సమయంలో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో జడ్డూ విశ్వరూపం ప్రదర్శించాడు. ఐదు వరుస సిక్సర్లు, ఫోర్ సహా మొత్తం 37 పరుగులు పిండుకొని ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గేల్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు.
తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే మరోసారి జడేజా ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. క్రిక్‌బజ్‌తో జరిగిన ఇంటర్య్వూలో ఈ సీజన్లో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్న ఇన్నింగ్స్ ఏంటో చెప్పగలరా అని బోగ్లేని అడిగారు. దానికి బోగ్లే స్పందిస్తూ.. ‘ ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్‌తో ఆల్‌రౌండర్ అంటే ఎలా ఉంటాడో చూపించాడు. అతనే సర్ రవీంద్ర జడేజా. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఇన్నింగ్స్ నన్ను ఆకట్టుకుంది. ఈ సీజన్లో నేను బాగా ఎంజాయ్ చేసిన ఇన్నింగ్స్‌లో దానిది తొలి స్థానం. మొదట 62 పరుగులు( చివరి ఓవర్లో 37 పరుగులు), బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లతో పాటు డైరెక్ట్ రనౌట్‌తో మెరిశాడు.
ఒక్క మ్యాచ్‌లోనే ఇన్ని రకాల యాంగిల్స్ చూపడమనేది జడేజాకు మాత్రమే సాధ్యమైంది. అతన్ని సర్ ఎందుకంటారో ఇప్పుడు తెలిసింది. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హర్షా బోగ్లే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జడేజా రీట్వీట్ చేశాడు. ‘ మీ అభిమానానికి థ్యాంక్స్ హర్షా బోగ్లే జీ.. కానీ మీరు నన్ను సర్ అనేకంటే రవీంద్ర జడేజా అని పిలిస్తేనే బాగుంటుంది అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు.
ఇక ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ తగిలింది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.