అమెరికా పర్యటనలో బిజీ, బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వాషింగ్టన్ చేరుకున్న సీఎంకు ఎన్‌ఆర్‌ఐలు, వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా(ఐఏఎస్), నీల్‌కాంత్ అవ్హద్ (ఐఏఎస్)లు జగన్‌ను కలిసి ఆహ్వానించారు.
అనంతరం భారత రాయబారి హర్హవర్ధన్ ష్రింగ్లా ఆహ్వానం మేరకు విందుకు హాజరయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతో జగన్ సమావేశమయ్యారు. వాషింగ్టన్‌లో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.
అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో జగన్ ప్రసంగించారు. పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని సీఎం స్పష్టంచేశారు.
తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని అన్నారు. తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమేనని.. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు.