ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా అదే సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 22 లోక్ సభ సీట్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జగన్ క్లాస్ మేట్స్ ఆయనకు వినూత్నంగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లోని బేగంపేటలో మెట్రో పిల్లర్స్ పై జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు అనేక మంది నేడు ప్రపంచ వ్యాప్తంగా పలు కీలక పదవుల్లో ఉండగా తాజాగా ఏపీ చరిత్రలోనే రికార్డు మెజారిటీతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న క్రమంలో ఆయన స్నేహితులంతా ఈ విధంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను కూడా రూపొందించారు. ‘ప్రౌడ్ ఆఫ్ యు జగన్’ అంటూ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయించారు. ఆ స్కూల్ లో 1983లో 5వ తరగతిలో చేరిన జగన్ అక్కడే ప్లస్ టూ పూర్తి చేశారు. వైఎస్ జగన్‌తోనే చదువుకున్న సినీ నటుడు సుమంత్, సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ ఆమీర్ అలీఖాన్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి లాంటి వారు త్వరలోనే వైఎస్ జగన్‌తో ‘ఓల్డ్ స్టూడెంట్ మీట్’కు సన్నాహాలు చేస్తున్నారు.