సకుటుంబ సపరివార సమేతంగా కోర్టుకు హాజరవ్వనున్న జగన్ కుటుంబం

సకుటుంబ సపరివార సమేతంగాన కోర్టుకు హాజరవ్వనున్న జగన్ కుటుంబం

నిజమే ఈ నెల 10వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే… ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే 11 కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న జగన్… సీఎం అయ్యాక ఓ మోస్తరు రిలీఫ్ లభించినట్టే కనిపించింది. అయితే సీఎం హోదాలో ఉన్నా సరే… ఇకపై వ్యక్తిగత హాజరుకు మినహాయింపులు ఇవ్వలేమని సీబీఐ కోర్టు తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో ఈ శుక్రవారం అంటే… ఈ నెల 10న జగన్… తన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో కలిసి సీబీఐ కోర్టుకు వెళ్లక తప్పదు.

అయితే అదే రోజున జగన్, సాయిరెడ్డిలతో పాటు జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి వైఎస్ షర్మిలలు కూడా కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి నెలకొంది. అదే జరిగితే… ఈ నెల 10న జగన్ సకుటుంబ సపరివార సమేతంగానే కోర్టుకు హాజరు కాక తప్పదన్న మాట. అయినా విజయమ్మ, షర్మిలలు కోర్టుకు ఎందుకు వెళ్లాలి? వారికి జగన్ పై నమోదైన కేసులకు ఏమైనా సంబంధాలున్నాయా? జగన్ కేసుల్లోనే వారు కోర్టుకు హాజరు కావాలా? అన్న ప్రశ్నలు చాలానే రేకెత్తుతున్నాయి. అయితే వీరిద్దరి కోర్టు హాజరుకు జగన్ కేసులకు ఎంతమాత్రం సంబంధం లేదట. వేరే కేసులో హైదరాబాద్ లోని వేరే కోర్టులో జరిగే విచారణకు విజయమ్మ, షర్మిల హాజరు కావాలట.

విజయమ్మ, షర్మిలలు కోర్టు మెట్లెక్కనున్న కేసు వివరాల్లోకి వెళితే… 2012లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందస్తు అనుమతి లేకుండా విజయమ్మ, షర్మిల రోడ్డుపై సభ ఏర్పాటు చేశారని, తద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పరకాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులోనే తాజాగా సమన్లు జారీ అయ్యాయి. వారిద్దరితో పాటు తెలంగాణ రాజకీయ నేతలు కొండా సురేఖ, కొండా మురళిలకు కూడా సమన్లు జారీ చేశారు. వీరందరూ జనవరి 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. సీఎం జగన్ సైతం అదే రోజున సీబీఐ కోర్టుకు రానున్నారు.