Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ కొత్త సినిమాకి వెళితే ఇంటర్వెల్ లో మాట్లాడుకునే మాటలు భలే సరదాగా అనిపిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ చూడకముందే కొందరు సినిమా ఫేట్ చెప్పేస్తుంటారు. ఇంకొందరు సినిమా ఇక ఎలా ఉండబోతోందో ఊహించేసుకుంటారు. ఆ ఐడియాస్ ని పక్క వాళ్లకి చెబుతుంటారు. నిజానికి సెకండ్ హాఫ్ పూర్తి అయ్యాక చాలా వరకు ఈ ఇంటర్వెల్ టాక్స్ గుర్తు వుండవు. ఒకవేళ వున్నా ఆ అభిప్రాయాలు కూడా మారిపోతుంటాయి. అందుకే సినిమా ఫలితం మీద ఇంటర్వెల్ టాక్ ప్రభావం ఉండదు. ఇది సినిమాలకు వర్తిస్తుంది కానీ రాజకీయాలకు కాదు కదా. అసలు రాజకీయాల్లో ఇంటర్వెల్ ఉంటుందా అని డౌట్ వస్తోందా ? అక్కడికే వస్తున్నాం.
వైసీపీ అధినేత జగన్ పాదయత్రకి సిద్ధం అవుతున్నారు. 6 నెలల సుదీర్ఘ పాదయత్రకి ఆయన శ్రీకారం చుడుతున్నారు. అయితే ఆయన అనుకున్నట్టు కోర్టు అనుమతి రాకుంటే ప్రతి శుక్రవారం యాత్రకి బ్రేక్ ఇచ్చి కోర్టుకి హాజరు కావాల్సిందే. అంటే ఇంటర్వెల్ తప్పదు. అలా ఒక్క రోజు ఇంటర్వెల్ వచ్చిందంటే జనం దృష్టి జగన్ కోర్టుకి వెళుతున్న దాని మీదకి మళ్లుతుంది. జగన్ ఎందుకు కోర్టుకి వెళ్లాల్సి వచ్చిందంటే ఆయన మీదున్న అవినీతి కేసులు మళ్లీ జనం దృష్టిలో పడతాయి. ఇన్నాళ్లు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లి వస్తున్నా ఆ విషయం పెద్దగా జనం దృష్టిలో పడలేదు. ఇప్పుడు పాదయాత్ర వల్ల అది ప్రజల నోట్లో నానితే ఎలా ? ఈ సందర్భాన్ని అధికార టీడీపీ ఇంటర్వెల్ టాక్ కి వాడుకోదా ? …అందుకే జగన్ కి శుక్రవారం బ్రేక్ అంటే భయం. ఆ బ్రేక్ లేకుండా పాదయాత్ర చేయాలని జగన్ కోరుకుంటున్నారు. కోర్టు అనుమతి వస్తుందో ,లేదో మరి ?