నవ్యాంధ్రకి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ ఈరోజు కడప జిల్లా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ లో జరిగిన కొన్ని మార్పుల వలన అది రేపటికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రాకారమ ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లి, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి, ఆపై తిరుపతికి వెళ్లాల్సిన జగన్, ఈరోజే తిరుపతికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుని ఆ తర్వాత రేపు ఇడుపులపాయ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబందించిన సమావేశాలు, సమీక్షలు జరిపి, ఆపై తిరుపతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మారిన షెడ్యూల్ ప్రకారం, నేటి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న జగన్, ప్రత్యేక విమానంలో రేణిగుంట వెళ్తారు. అక్కడి నుంచి రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకునే జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం సుప్రబాత సేవ సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత తిరిగి రేణిగుంటకు వచ్చి, ప్రత్యేక విమానంలో కడపకు వస్తారు. కడప పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం పులివెందులకు వెళ్లి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆపై మళ్లీ కడపకు వచ్చి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.