తిరుమల ‘మాజీ ప్రధాన అర్చకులు’ విషయంలో జగన్ కీల‌క నిర్ణ‌యం

తిరుమల 'మాజీ ప్రధాన అర్చకులు' విషయంలో జగన్ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మళ్లీ విధులకు హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న ఓకే చెప్పేశారు. సీఏం ఆదేశాలతో రమణ ధీక్షితులుకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ టీటీడీ ఆదేశాలు వెలువ‌రించింది. ఆగమ సలహదారుడిగా రమణధీక్షితులును టీటీడీ నియమించనుంది. 65 ఏళ్లు నిండాయంటూ రిటైర్మెంటు ప్రకటించడాన్ని తిరుచానూరు పద్మావతి ఆలయ అర్చకులు హైకోర్టులో సవాలు చేయడం.. వారికి సానుకూలంగా తీర్పు రావడం తెలిసిందే.  హైకోర్టు తీర్పుతో అందరి దృష్టీ రమణదీక్షితులపై మళ్లింది.  త్వరలోనే తిరిగి స్వామి సేవలో కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అప్పట్లో టీటీడీపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో…రమణ దీక్షితులుని పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. పవిత్రమైన శ్రీవారి పోటులో నిబంధనలకు, ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారని, పింక్ డైమండ్ సహా కొన్ని రకాల నగలు, ఆభరణాలు మాయం అయ్యాయంటూ ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ సారథ్యంలో ఏర్పాటైన నాటి పాలక మండలి రమణ దీక్షితులకు పదవీ విరమణ చేయించింది.  65 సంవత్సరాల కంటే అధిక వయస్సున్న అర్చుకులందరూ పదవీ విరమణ చేయాలంటూ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై రమణ దీక్షితులు న్యాయపోరాటం చేసి, విజయం సాధించారు. దీంతో, ప్ర‌భుత్వం ఆయ‌న‌కు లైన్ క్లియ‌ర్ చేసింది. రమణదీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

మ‌రోవైపు జ‌గ‌న్ ఇటీవ‌లి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా  తిరుమ‌ల పూర్వ ప్రధానార్చకులు ర‌మ‌ణ‌దీక్షితులు ఆలయం ప్రవేశం చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేయడంతో టీటీడీ.. రమణ దీక్షితులుకు ఆలయ ప్రవేశం కల్పించింది. ఆగమ సలహామండలి సభ్యుడితో పాటు, శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడానికి అనుమతిని ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు ఆయనకు మార్గం సుగమమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా రమణ దీక్షితుల పదవీ విరమణ వివాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని స‌మాచారం.