జగన్ తండ్రిని ఇంత ఘోరంగా కూడా అవమానించారా…?

Jagan Insulted His Father

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి భేటీ కావడం పెద్ద విషయం కాదు. కానీ ఆ భేటీ తర్వాత ఆ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను అవమానించేవే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతుండడంతో రాజశేఖరరెడ్డి వ్యతిరేకులతో జగన్ చేతులు కలుపుతున్నట్లు అవుతోంది. అంటే ఒకరకంగా రాజశేఖరరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించినవారితోనే జగన్ కలుస్తుండడం, ఎన్నికల్లో గెలుపు కోసం వారి సహాయాన్ని కోరడం ఆయనని అవమానించినట్టే కదా. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటె తెలంగాణా వచ్చేదే కాదు అనే వాదన మీరు చాలా మంది వద్ద వినే ఉంటారు, ఆ వాదన నిజమే. ఎందుకంటే ప్రాంతీయ వాదాలను రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో ఆపగలిగారు. ఆయనే ఉండుంటే ఈ రోజు టీఆర్ఎస్ అనే పార్టీ మనుగడలో ఉండేదే కాదు. ఇక అలాంటి పార్టీ తెలంగాణాను తేవడం అనేది కలలో మాట అయ్యేది. ధ్ర ప్రజలపై కేసీఆర్ విషం కక్కుతున్న రోజుల్లోనే కేసీఆర్‌ను వైఎస్ నిలదీశారు.

‘తెలంగాణకు రావాలంటే పాస్‌పోర్ట్ ఉండాలా’ అని ప్రశ్నించి మరీ కేసీఆర్ నోరు మూయించారు. మాహాకూటమితో పొత్తు పెట్టుకుని 2009లో యాభై సీట్లు పోటీ చేసిన తెరాస పది సీట్లు గెలిచింది, ఈ సమయంలో పట్టుమని పది సీట్లు గెలవలేదు… తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్రా? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా? అని అప్పటి శాసనసభా పక్ష నేతగా ఉన్న ఈటెలను ప్రశ్నించారు వైఎస్. అప్పుడు ఆంధ్ర హోటళ్లు మూయిస్తాం, విద్యాసంస్థలు మూయిస్తాం, ఆంధ్రవారి వ్యాపారాలు మూయిస్తామంటూ కేసీఆర్ చేసిన బెదిరింపు ప్రకటనలను అసెంబ్లీలో చదివి వినిపించి మరీ నిలదీసిన వ్యక్తి వైఎస్, తెలంగాణ ఏర్పాటుకు రాజశేఖర రెడ్డి మాత్రమే అడ్డం అని కేసీఆర్ ప్రచారం చేసినా సరే తెలంగాణ సెంటిమెంటును ఎంతగా రగిల్చినా సరే అభివృద్ధి నినాదంతో ఎన్నికలకు వెళ్లి టీఆర్ఎస్‌ను 10 సీట్లకు పరిమితం చేసిన వ్యక్తి ఆయన. నిజానికి ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. రాజశేఖరరెడ్డి కనుక ఇంకొన్నాళ్లు బతికి ఉంటే టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రోజు ఉండేది కాదేమో.

ఇప్పుడు అదే రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహనరెడ్డి వెళ్లి ఆంధ్ర ద్వేషి అయిన కేసీఆర్ పంచన చేరుతున్నారు. ఇది వైఎస్ ని జగన్ అవమానిస్తున్నట్టు కాదా ? తండ్రి పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ అని పార్టీ పెట్టిన జగన్మోహనరెడ్డి ఆయన ఆశయ సాధనకే తన పార్టీ అంటూ ఉంటారు ఇప్పుడు ఆయన ఆశయాలకే తూట్లు పొడిచేసి తన బతికున్నప్పుడు అసలు కుటుంబాన్ని బయటకు తేని వైఎస్ కుటుంబ పరువును కూడా బయటకీడుస్తున్నారు. నిజానికి జగన్ సోదరి షర్మిళకు సంబంధించి సోషల్ మీడియాలో ఎవరో సృష్టించిన పుకార్లు కొద్దిమందికే చేరుంటాయి కానీ, ఇప్పుడు ఆమెను బయటకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో తెలియని వారికీ ఈ పుకార్లు తెలిసినట్లయింది. కేసీఆర్‌తో చేతులు కలపడంతో రాజశేఖరెడ్డి ఆశయాలనే కాదు ఆయన రాజకీయ లక్ష్యాలనూ గంగలో కలిపేశారు జగన్.రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది వైఎస్ కల. ఆయన చివరి కోరిక కూడా అదే. కానీ జగన్ రాహుల్ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న శక్తులతో కలిశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా వేధిస్తూ.. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కక్ష కట్టిన ప్రధాని నరేంద్ర మోదీతో.. అణువణువునా విషం నింపుకొని ఆంధ్రప్రదేశ్‌పై అక్కసు వెళ్లగక్కే కేసీఆర్‌తో కలవడం ద్వారా జగన్మోహనరెడ్డి అసలు ఏపీ ప్రజలకు ఏమి మెసేజ్ ఇద్దమనుకుంటూన్నారో.