ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలని చంద్రబాబుకు ఆయన ఫోన్ లో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, మీరు వస్తే తనకు ఆనందమని ఓ సీనియర్ నేతగా, రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సీఎంగా పని చేసిన అనుభవమున్న తమ ఆశీస్సులు కావాలని జగన్ కోరినట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్టు సమాచారం. దీనిపై చంద్రబాబు సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 30న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చకా, చకా సాగుతున్నాయి. జగన్ ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఆహ్వానించారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతుండగా మోడీ ప్రమాణ స్వీకారం కూడా అదే రోజున కావడంతో ఆయన రావడంలేదు. అయితే బాబు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయం మీద టీడీపీ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
