జగన్ మాట తప్పారా ? నెట్టింట జోరుగా చర్చ

jagan is wrong discussing on internet

మాట ఇస్తే దాన్ని తప్పనని, నెరవేరుస్తానని ఎన్నోసార్లు చెప్పిన వైఎస్ జగన్ మాట తప్పారట. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొత్త చర్చ ఇదే. జగన్ తన మంత్రి వర్గాన్ని నిర్ణయించుకున్న నేపథ్యంలో, గతంలో ఆయన ఇచ్చిన మాటను, అందునా ప్రజల ముందు ఇచ్చిన మాటను విస్మరించారని ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలో మర్రి రాజశేఖర్ విషయంలోనూ ఆయన మాట తప్పారని అంటున్నారు. మాజీ మంత్రి, చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్ పై రామకృష్ణారెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరికి వచ్చిన జగన్, ఇక్కడి నుంచి రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే, ఆయనకు మంత్రి పదవిని ఇస్తానని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చిలకలూరిపేట నుంచి టికెట్ ను ఆశించి, విఫలమైన రాజశేఖర్ విషయంలో కూడా చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ ను కొన్ని కారణాలతో విడదల రజనికి ఇవ్వాల్సి వచ్చిందని, ఓటర్లు ఆమెను గెలిపించాలని, ఇక్కడి స్థానిక నేత రాజశేఖర్ కు మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలనూ జగన్ నెరవేర్చలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, తమకు మంత్రి పదవులు రాకపోవడంపై అటు ఆళ్లగానీ, ఇటు మర్రిగానీ ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.