ఏపీ మాజీ స్పీకర్ కుటుంబం అరాచకాలు…కే ట్యాక్స్ వసూలు

kodela shivaprasad rao came in front of media

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల కుటుంబం దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామ్ చేసిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే కేసు నమోదుకాగా. తాజాగా ఆయన కూతురు అవినీతి భాగోతం బట్టబయలైంది. భూ కబ్జాతో పాటు కే ట్యాక్స్ వసూలు కోసం ఓ మహిళను బెదిరించడంతో పాటు దాడి చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు.  కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో అపార్టుమెంట్ల అనుమతికి తన వద్ద అక్రమంగా డబ్బు వసూళ్లు చేశారని.. అలా చేయడమే కాకుండా ఇంకా తనను డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారని మల్లికార్జునరావు అనే బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడెల కుమారుడితో పాటు ఆయన అనుచరులు గుత్తా నాగప్రసాద్, ఇంజనీర్ ఉన్నం వేణుగోపాలరావులపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బాధితుడు కోరాడు. కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై అర్వపల్లి పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేశారు. కోడెల కుమార్తెతో పాటు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబుపై శనివారం రోజున నరసరావుపేటలో కేసు నమోదు అయ్యింది. గతంలో తాను కొనుగోలు చేసిన భూమికి అన్యాయంగా తనవద్ద డబ్బు వసూలు చేశారని పద్మావతి ఆరోపిస్తున్నారు. తాను అప్పట్లో డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంకా డబ్బు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని పద్మావతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు