హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ఓ భారీ ప్లెక్సీ ఇప్పుడందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటున్న చిత్రంతో ఈ ప్లెక్సీ ఉంది. దీనిపై “ఇది చారిత్రక అవసరం. మన తెలుగువారికి శుభదినం” అని కనిపిస్తోంది. ‘పీపుల్ ఫర్ బెటర్ హైదరాబాద్’ పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. ఏపీకి జగన్ సీఎం అయిన తరువాత, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు, నీటి సమస్యలు సాధ్యమైనంత త్వరగా తీరిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీ పేరిట ఉన్న నిరుపయోగ భవనాలను తెలంగాణకు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో అద్భుత విజయం సాధించి తొలిసారిగా ప్రగతి భవన్ విచ్చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలో జగన్ దంపతులకు అపూర్వ స్వాగతం లభించింది.