జగన్ లండన్ టూర్ హవాలా కోసమేనా ?

Jagan London Tour Chandrababu Allegations Hawal

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఎన్నికలకు ముందుకు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని తప్పుబట్టిన ఆయన హవాలా డబ్బు కోసమే లండన్ టూర్‌కు వెళ్లారని ఆరోపించారు. ఈరోజు ఉదయం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో భాగంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొన్న సమయంలో జగన్ ప్రశాంతంగా విదేశీ పర్యటనకు వెళ్లడం వెనుక ఏదో కుట్ర దాడి ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు పార్టీ సన్నద్ధం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక వంటి వాటిని పట్టించుకోకుండా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిన్న రాజమహేంద్రవరంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని రాష్ట్రానికి నిధులు సక్రమంగా ఇవ్వకుండానే వేలు, లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ పర్యటనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రతిపక్షం విమర్శలను పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎదురుదాడి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.