ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల తరువాత రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ అధినేత జగమ్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి విషయమై ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల శ్రేయస్సు కై నిరంతరం పాటు పడుతున్నాడు. కాగా రాష్ట్రంలోని రైతుల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ, రైతులందరికీ కూడా అండగా ఉన్నానని నిరూపించుకున్నారు సీఎం జగన్. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి… తాజాగా రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా మరొక శుభవార్త చెప్పారు.
కాగా పంట దిగుబడులు, రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో మూడు దశల్లో 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవి కూడా వచ్చే ఏడాది జనవరి నుండి ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అయితే జనవరిలో 3300 కేంద్రాలను, ఫిబ్రవరిలో 5,000 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. కాగా ఈమేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటు చేస్తమని, కియోస్క్ లు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
అంతేకాకుండా ఈ కేంద్రాల ద్వారా కల్తీ లేని పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు ఇస్తామని, అది కూడా ప్రబుత్వంతో ఒప్పందం చేసుకున్న వారే సరఫరా చేస్తారని వెల్లడించారు. ఇకపోతే ఈ కేంద్రాల ద్వారా రైతులందరికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలను అందించనున్నారు.