ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలు రానున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి వివాహానికి హాజరుకానున్నారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో వివాహ వేడుక ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీఎం హాజరవుతుండటంతో ప్రొటోకాల్ ప్రకారం పోలీసులు, అధికారులు భద్రత, ఇతర ఏర్పాట్లను చేపట్టారు. బుధవారం ఉదయం 10.20 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడ 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొని 12.15 గంటలకు తిరిగి బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కోటేశ్వరరావు, కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు డాక్టర్ మనజీర్ జిలానీ, ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, నారపురెడ్డి మౌర్య, మునిసిపల్ కమిషనర్ డీకే బాలాజీ, డీఆర్వో బి.పుల్లయ్యలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం ఓర్వకల్లు చేరుకున్నప్పటి నుంచి వివాహంలో పాల్గొని తిరిగి వెళ్లే వరకు పటిష్ట బందోబస్తుతోపాటు ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. ఆయా అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.