ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీలో చ‌ర్చ పెట్టి ఆమోదం పొంద‌డం, అనంత‌రం ఈ బిల్లును వెంటనే కేంద్రానికి పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు భ‌గ్గుమంటున్నారు. మండ‌లి ర‌ద్దు అప్ర‌జాస్వామికం అని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో…గ‌తంలో చంద్ర‌బాబు మాట్లాడిన అంశాల‌ను పేర్కొంటూ…వైసీపీ ఓ వీడియోను విడుద‌ల చేసింది. ఆ ఒక్క వీడియో చంద్ర‌బాబు ప‌రువును గంగ‌పాలు చేసింది.

2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ‌డం, కాంగ్రెస్ పీఠం చేజిక్కించుకోవ‌డం, అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి శాసనమండలిని పున‌రుద్ధ‌రించే నిర్ణ‌యం తెలిసిన సంగ‌తే. అయితే, శాసనమండలి గురించి అసెంబ్లీలో చ‌ర్చ సంద‌ర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన మాట‌లు ఉన్న వీడియోను అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించారు. “శాసనమండలి వలన ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అలాగే బిల్లులు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది, ఇది కేవలం రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమే. అసెంబ్లీలోనే ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు ఇక శాసనమండలి అవసరం లేదు.“ అంటూ శాస‌న‌మండ‌లి న‌ష్టాల‌ను, దాని వ‌ల్ల ఎంత‌మాత్రం ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌ని విధానాన్ని పేర్కొంటూ…చంద్ర‌బాబు విశ్లేషించిన తీరు ఉన్న వీడియో అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించారు.

కాగా, చంద్రబాబు రెండు నాలుకల ధోరణి దీంతో బట్టబయలు అయింద‌ని అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సంద‌ర్భంగా అన్నారు. రామాయణంలో యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను చంద్రబాబు, లోకేష్‌లు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. మండ‌లిపై చంద్రబాబు తొలినుంచి రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ర‌జ‌ని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే చంద్రబాబుకు శాసనమండలి బంగారుబాతులా కనిపించిందని, కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలకు ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.