ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామని తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుందన్న నమ్మకం కలిగించాలని సీఎం అన్నారు. గతంలో హడావుడి ఎక్కువగా.. పని తక్కువగా ఉండేదన్నారు.‘‘గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,588 కోట్లను చెల్లించాం. ఇప్పటివరకు రూ.2,086 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 62 శాతం, మహిళలకు 42 శాతం ప్రోత్సాహకాలు అందించాం. పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశాం. కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ పార్క్‌ను స్థాపిస్తున్నాం. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైఎస్సార్ ఈఎంసీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని’’ సీఎం అన్నారు.
ఈ రెండున్నరేళ్లలో 68 భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. త్వరలో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు ప్రారంభమవుతాయన్నారు. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. మరో 9 కొత్త ఫిషింగ్ హార్బర్‌లను ఏర్పాటు చేయబోతున్నామని సీఎం పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో జనంలో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపలేదని సీఎం అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారంచేస్తున్నాయని సీఎం అన్నారు.పర్రిశమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలపై జాతీయ సర్వేలో ఏపీకి ప్రథమస్థానం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఎంత నమ్మకం ఉందో ఈ సర్వేనే ఉదాహరణ అని సీఎం అన్నారు. 9 లక్షల 51 వేల మంది చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రుణాలు అందించామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది.