ఐటీ డేటా లీక్…బాబుని జైలుకి పంపే కేసు !

Jagan Slams CBN On IT Grid

రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. సేవా మిత్ర యాప్‌తో కుట్రపూరితంగా ఓట్లను తొలగించి దొంగ ఓట్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు. రెండేళ్లుగా మొత్తం 59 లక్షల దొంగ ఓట్లను జాబితాలో చేర్చారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా ఈ కుట్రలు చేస్తున్నారని ఇదే అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సైబర్ క్రైమ్‌కు పాల్పడటం దొంగతనం కాదా అని ప్రశ్నించారు జగన్. రాష్ట్ర, దేశ చరిత్రలోనే ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగి ఉండదన్నారు. రెండేళ్లుగా ఓ పద్దతి ప్రకారం ఎన్నికల్ని మేనేజ్ చేసేందుకు చంద్రబాబు సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.

హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్‌ కంపెనీపై జరిగిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయన్నారు. టీడీపీకి సంబంధించిన సేవా మత్రి యాప్‌ను ఐటీ గ్రిడ్ కంపెనీ తయారు చేసిందని.. ఆ యాప్‌లో ప్రజల సమాచారం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఓ ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉండకూడని సమాచారం ఐటీ గ్రిడ్ దగ్గర ఎందుకు ఉందో చెప్పాలన్నారు జగన్. ఈ సమాచారం సేవా మిత్రలో ఉండటం సబబేనా.. ఓటర్ల ఐడీ డేటా కలర్ ఫోటోలతో ఉందని.. మాస్టర్ కాపీ ఐటీ గ్రిడ్ కంపెనీ దగ్గర ఎలా ఉంది, ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఇవి చంద్రబాబు, లోకేష్‌లను జైలుకు పంపే కేసులన్నారు జగన్. సైబర్ క్రైమ్‌కు పాల్పడినందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐటీ మంత్రిగా లోకేష్ ఈ కేసుకు బాధ్యులన్నారు. ఇక హైదరాబాద్‌లో కేసులు ఎందుకు పెట్టారన్న ప్రశ్నపై స్పందించిన జగన్ దొంగతనం జరిగిన చోట కేసు పెడతామన్నారు. అందుకే హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశామన్నారు. నేరం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆంధ్ర మధ్య యుద్ధం జరుగుతున్నట్లు డ్రామాలు మొదలు పెట్టారని ఆరోపించారు.