ఆరోగ్య అంశంపై సీఎం జగన్‌

ఆరోగ్య అంశంపై సీఎం జగన్‌

మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం జగన్‌ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేశామని అన్నారు. ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించామని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందింస్తున్నామని చెప్పారు.

ఇతర రాష్టాల్లో 130 సూపర్‌ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై ఎన్నో మెలికలు పెట్టిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో గుండె మార్పిడి బైకాక్లియర్‌, స్టెమ్‌ సెల్స్‌ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 29 నెలలుగా ఆరోగ్యశ్రీపై రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వ బకాయిలు రూ. 600 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ చెప్పారు. 21 రోజుల్లో నెట్‌వర్క్‌ ఆస్సత్రులకు బిల్లుల చెల్లిస్తున్నామని తెలిపారు.

వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2,446 చికిత్స అందించామని సీఎం పేర్కొన్నారు. గతంతో పోలిస్తే చికిత్పలు రెట్టింపు చేశామని వివరించారు. ఇంకా అవసరమైనవి కూడా కొత్తగా చేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని సీఎం తెలిపారు. ప్రతీ పార్లమెంట్‌ పరిధిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసి.. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించనున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో కొత్తగా టీచింగ్‌ ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. గ్రామస్థాయి నుంచి సమూల మార్పులు తీసుకొస్తున్నాని తెలిపారు. నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని, రూ.16,255 కోట్లలో ఆస్పత్రుల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శాఖలో 9712 పోస్టులు భర్తీ చేశామని, 14788 పోస్టులు వచ్చే ఫిబ్రవరిలోగా భర్తీ చేస్తామని తెలిపారు.10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్స్‌ ఏర్పాటు చేశామని, గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. వచ్చే 6 నెలల్లో వైద్య సంస్కరణలు అమల్లోకి వస్తాయిని సీఎం జగన్‌ వివరించారు.

వైఎస్సార్‌ కంటివెలుగు ద్వారా 66 లక్షల పిల్లలకు పరీక్షలు చేశామని, 3 ప్రాంతాల్లో కొత్తగా చైల్డ్‌ కేర్‌ ఆస్పత్రులను నిర్మిస్తామని తెలిపారు. కోవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చామని సీఎం పేర్కొన్నారు. కోవిడ్‌ అనంతర సమస్యలకు కూడా ఆరోగ్య శ్రీ చికిత్స అందిస్తున్నామని, ఏపీలో కోవిడ్‌ మరణాల రేటు 0.70 మాత్రమే ఉందని సీఎం జగన్‌ చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్‌ వచ్చిన 99.3 శాతం మందిని కాపాడుకున్నామని తెలిపారు. కోవిడ్‌ పరీక్షల కోసం 19 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పారు. జనాభాలో 87 శాతం మందికి ఒక డోసు వ్యాక్సిన్‌ అందించినట్లు తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.