బీసీలే టార్గెట్….వైసీపీ రాజకీయం !

ఎన్నికలు సమీపిస్తుండటంతో కుల రాజకీయాలు మొదలయ్యాయి. తాజాగా టీడీపీ నిర్వహించిన బీసీ గర్జనకు పోటీగా వైసీపీ కూడ బీసీ గర్జన నిర్వహించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఏలూరులో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జగన్‌తో సోమవారం నాడు బీసీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 19న వైసీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్‌ జంగా కృష్ణమూర్తి తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం బీసీ గర్జనపై కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం జగన్ నియమించిన బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల స్థితి గతులపై సమగ్ర నివేదికను రూపొందించిందని తెలిపారు. నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందజేశామని, వాటిని ఆయన పూర్తి స్థాయిలో సమీక్షించారని చెప్పారు. కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఈ బీసీ గర్జన సదస్సులో చంద్రబాబు హామీలకు కౌంటర్ గా పలు ఆకర్షణీయమైన పథకాలను జగన్ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బీసీలే టార్గెట్....వైసీపీ రాజకీయం ! - Telugu Bullet

తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకే నిర్ణయాత్మక శక్తిగా ఉండబోతుంది కాబట్టి బీసీలు తమ వెంటే ఉన్నారని చెప్పుకోవడానికి, జనాలకి చూపించడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఇప్పటిదాకా తమను అణగదొక్కిన చంద్రబాబును బీసీలు ఇక నమ్మడానికి సిద్దంగా లేరని బీసీలకు న్యాయం జరగాలంటే వైసీపీయే ప్రత్యామ్నాయం అని బీసీలందరూ తమతోనే ఉన్నారని చెప్పుకోడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా బీసీ ఓటు బ్యాంకు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయనేది ఈ సభ ఏర్పాటుతో సుస్పష్టం. జయహో బీసీ ద్వారా బీసీలపై చంద్రబాబు వరాల జల్లు కురిపించగా ఫిబ్రవరి 19న వైసీపీ నిర్వహించే బీసీ గర్జనలో జగన్ ఎలాంటి హామీలు, ప్రకటనలు గుప్పించాబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.