మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఓ ఉద్యోగికి చేసిన హెచ్చరిక పెను దుమారం రేపుతోంది. ‘మంత్రి ఉమాని ఓడించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చాలా ఇంట్రెస్టుగా ఉన్నాడు. అవసరమైతే కడప నుంచి మనుషుల్ని దించుతాడు’ ఇదీ ఓ ప్రభుత్వోద్యోగికి ఆయన చేసిన హెచ్చరిక. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుండి మంత్రి దేవినేని ఉమ ఎమ్మెల్యేగా ఎన్నికై మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్ ఆయనపై వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతున్నారు. టీడీపీకి పట్టున్న గ్రామాలైన ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడిల్లో వైసీపీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. గుంటుపల్లిలో భారీగా ఫ్లెక్సీలు పెట్టింది. అయితే అక్కడి పంచాయతీ సిబ్బంది రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించేందుకు నిర్ణయించారు. దీంతో వైసీపీ ఈ విషయాన్ని కృష్ణప్రసాద్‌కు, వసంత నాగేశ్వరరావుకు తెలియజేశారు.
నాగేశ్వరరావు ఈ నెల 7 రాత్రి గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్.వి.నరసింహారావుకు ఫోన్‌చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ముందు తానెవరో తొలుత తానెవరినో పరిచయం చేసుకున్న వసంత అవసరమైతే మర్డర్లకు కూడా వెనుకాడకూడదని మా వాడు కృష్ణప్రసాద్ గట్టి పట్టుదలగా ఉన్నాడని, ఒకరిద్దరిపై ఎటాక్‌కు సిద్ధమని కూడా పేర్కొన్నారు. జగన్ కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్‌గా ఉన్నాడని, అవసరమైతే కడప నుంచి మనుషుల్ని దించాలని అనుకుంటున్నాడని బెదిరించారు. టీడీపీ ఏజెంట్‌గా పనిచేయడం మానుకోవాలని హెచ్చరించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ తన స్నేహితుడేనని, అతడికి చెప్పి ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని, లేదంటే విచారణ జరిపించేలా చేయించవచ్చని, కానీ తాను అంతదూరం ఆలోచించడం లేదన్నారు. అయితే ఈ కాల్ చేసి బెదిరించిన విషయం మీద గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నల్లారి నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వసంత నాగేశ్వరరావు మీద కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.