శ్రీవారిని దర్శించుకున్న జగన్…ఎమ్మెల్యేలు సహా వర్మతో

Jagan Visited Tirumala

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ ఇంకా కాబోయే సీఎం కాబట్టి సామాన్య భక్తుల మాదిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.  ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రులు, గవర్నర్లు నేరుగా మహాద్వారం నుంచి ప్రవేశించి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. కానీ, జగన్ ఇంకా సీఎంగా ప్రమాణం చేయలేదు కాబట్టి వీవీఐపీ దర్శన సమయంలో ఆయన వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. జగన్‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, అర్చకులు ఆయన్ని ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి, రోజా, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇతర నేతలు కూర్చున్నారు. ఇక జగన్ తో పాటు పలువురు గెలుపొందిన వైసిపి ఎంఎల్‌ఎ లు, నేతలు, నాయకులు తరలివచ్చారు. వారితో పాటు వచ్చిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, సంప్రదాయ దుస్తుల్లో స్వామి ని దర్శించుకున్నారు.  జగన్‌ సిఎం గా ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రత్యేకంగా ‘ లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌ ‘ చిత్రాన్ని ఆయనకు చూపిస్తానని వర్మ పేర్కోన్నారు.