కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా నెలకు ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి జీతాన్ని మాత్రమే తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 2.5 లక్షలు. ఇతర అలవెన్సులు అన్నీ కలిపితే 4 నుంచి 5 లక్షల వరకు వస్తుంది. కానీ ఇప్పటికే కష్టాల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొనే జగన్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇక ఇదే విధానాన్ని అప్పట్లో ఎన్టీఆర్ ఆ తర్వాత వైఎస్ ఫాలో అయ్యారని ఇప్పుడు అదే విధానాన్ని జగన్ అనుసరించనున్నారని అంటున్నారు. జగన్ ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తనకు ప్రభుత్వ వసతి గృహం వద్దని చెప్పారు. భారీగా అద్దెలు చెల్లించి తనకు వసతి గృహం ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఇక జగన్ బాటలోనే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నడవనున్నట్లు సమాచారం.