దేశ రాజధాని ఢిల్లీ జహంగీర్‌పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన మహిళను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లే క్రమంలో సోమవారం మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది.
జహంగీర్‌పురిలో శనివారం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా.. మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకుగానూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటిదాకా 23 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి వాడీవేడిగానే ఉందక్కడ. ఇదిలా ఉండగా..నిందితుల్లో ఒకడైన సోనూ భార్యను పోలీసులు ఇంటరాగేషన్ పేరిట అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను తరలిస్తున్న క్రమంలో.. యాభై మంది మహిళలను పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. శనివారం అల్లర్లు జరిగిన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలోనే.. తాజా అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇక శనివారం జరిగిన అల్లర్లకు ఘటనకు సంబంధించి.. దేశీ పిస్టోల్స్‌తో పాటు ఐదు కత్తులను పోలీసులు నిందితుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. నిందితులను సైతం కోర్టు ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవాళ్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేశ్ ఆస్థానా వెల్లడించారు.