జైసింహా… తెలుగు బుల్లెట్ రివ్యూ

Jai Simha Movie review
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నటీనటులు :   బాలకృష్ణ , నయనతార , నటాషా దోషి, హరి ప్రియ…
నిర్మాత:  సి. కళ్యాణ్ 
దర్శకత్వం :  కె.ఎస్. రవికుమార్ 
సినిమాటోగ్రఫీ:  సి. రామ్ ప్రసాద్ 
ఎడిటర్ :  ప్రవీణ్ ఆంటోనీ 
మ్యూజిక్ :  చిరంతన్ భట్ 

పెద్ద హీరోలు ఓ సినిమా చేయాలంటే 100 కధలు వింటున్నారు. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే హైరానా పడిపోతున్నారు. అయితే ఇందుకు నటసింహం బాలయ్య మినహాయింపు. సినిమా తర్వాత సినిమా చేసుకుంటూనే వెళ్లిపోతున్నారు. సక్సెస్ ఫుల్ బ్యానర్లు, దర్శకులు అని చూసుకోకుండా మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు బాలయ్య అలా ఒప్పుకుందే ఆయన నూట రెండో సినిమా జైసింహా. అంతగా హిట్స్ లేని నిర్మాత సి. కళ్యాణ్ , ఫామ్ లో లేని దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ని నమ్మి జైసింహా ని ఒకే చేసాడు బాలయ్య. ఆ నమ్మకాన్ని జైసింహా యూనిట్ నిలబెట్టుకుందోలేదో చూద్దాం.

కథ…

నరసింహ ( బాలకృష్ణ ) ఓ మెకానిక్. చిన్నప్పుడే చదువు చెప్పిన గురువు ( ప్రకాష్ రాజ్) గారి అమ్మాయి గౌరీ (నయనతార) స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. అయితే అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎన్నో గొడవల్లో చిక్కుకున్న నీకు ఇచ్చి నా కూతురు పెళ్లి ఎలా చేయను అన్న మాటతో నరసింహ కఠిన నిర్ణయం తీసుకుంటాడు. గౌరికి i దూరమైన అతడు తీసుకున్న నిర్ణయం ఏ పరిణామాలకు దారి తీస్తుంది ? నరసింహ. గౌరీ జీవితాలు ఏ మలుపు తీసుకుంటాయి? గౌరీ కోసం నరసింహం చేసే త్యాగం ఏంటి ? వైజాగ్ నుంచి నరసింహం కుంభకోణం ఎందుకు వెళ్ళాడు అన్నదే మిగిలిన సినిమా.

విశ్లేషణ…

బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్ అనగానే ఇంకో రొటీన్ సినిమా చూస్తాం అన్న ఫీలింగ్ ఎక్కువ మందికి కలుగుతుంది. బాలయ్య మార్క్ మాస్ మసాలా సినిమా చూపిస్తారు అనుకుని వెళితే ఏకంగా ఓ లవ్ స్టోరీ చూపించేసారు ఈ ఇద్దరు సీనియర్స్ . చెప్పడానికి కాస్త ఇబ్బందిగా వున్నా ఇది జైసింహా ఓ పవిత్రమైన ప్రేమ కథ. ఈ కధకు బీజం ప్రేమ, త్యాగం అయినప్పటికీ బాలయ్య హీరో అయ్యేసరికి ఫీల్ గుడ్ మూవీ గా తీయాల్సిన కథ కాస్తా కమర్షియల్ రంగు పులుముకుంది. దీంతో ఆ ప్రేమకథకు పగ,ప్రతీకారాలు కూడా తోడు అయ్యాయి. సినిమా చూస్తున్నంత సేపు లవ్ ట్రాక్ మినహా మిగతా సీన్స్ బాలకృష్ణ పాత సినిమాల్ని గుర్తు చేస్తాయి. యాక్షన్ కోసం కొన్ని ఎపిసోడ్స్, డైలాగ్స్ కోసం కొన్ని ఎపిసోడ్స్ ఈ ప్రేమ కధలో ఇరికించారు. బ్రాహ్మణుల ధర్నా ఎపిసోడ్ బాగున్నప్పటికీ, ట్రాఫిక్ ఎపిసోడ్ అనుకున్నంత పండలేదు. కానీ బాగా తెలిసిన కథ, సీన్స్ తెర మీద కనిపిస్తున్నప్పటికీ పెద్దగా బోర్ కొట్టకుండా దర్శకుడు రవికుమార్ జాగ్రత్తపడ్డాడు. చిత్రీకరణలో పాతదనం కొట్టొచ్చినట్టు కనిపించినా అక్కడక్కడా కొన్ని మెరుపులు లేకపోలేదు.బ్రహ్మానందం కామెడీ ఎపిసోడ్ రజని చంద్రముఖి నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. పైగా బాగా మాస్ కామెడీ.

కథ, కధనంలో ఎంత రొటీన్ అనిపించినా బాలకృష్ణ మొత్తం సినిమాని తన భుజాల మీద మోశాడు.యాక్షన్ , డైలాగ్ ఎపిసోడ్స్ లో బాలయ్య ఎలా రెచ్చిపోతాడో చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాలో బాలయ్య ని శాంతమూర్తిగా, ప్రేమికుడిగా చూపించడం ప్రత్యేకం. ఆ విషయంలో బాలయ్య ఎక్కడైనా మిస్ మ్యాచ్ అవుతాడు అనుకుంటే వయసు పరంగా ఆ లోపం తెలుస్తుంది కానీ బాలయ్య నటనాపరంగా కాదు. హాలీవుడ్ లో 50 ఏళ్ళు దాటిన వారి నటనలో సహజంగానే పరిణితి కనిపిస్తుందని చెప్పుకుంటారు. బాలయ్య నటన కూడా జైసింహా లో అలాగే అనిపిస్తుంది. ఇక అమ్ముకుట్టి పాటలో బాలయ్య వేసిన స్టెప్స్ చూస్తుంటే ఈ వయసులో కూడా ఇలాగా అనిపిస్తుంది . కొన్ని సీన్స్ లో బాలయ్య ఇంత బాగా చేస్తాడా అనిపించింది. 102 సినిమాల తర్వాత బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ఆ అవసరాన్ని ఇంకోసారి కల్పించిన రవికుమార్ దర్శకత్వాన్ని ఈ కోణంలో మెచ్చుకోవాల్సిందే. ఇక బాలయ్య తో పాటు నయనతార, హరిప్రియ ,నటాషా, ప్రకాష్ రాజ్ పాత్రలు బాగున్నాయి. బాగా చేశారు.

సాంకేతిక విషయాల జోలికి వెళితే కెమెరా, యాక్షన్ , డాన్స్ విభాగాలు పనితనం బాగుంది. మ్యూజిక్ పరంగా చూస్తే పాటలు పర్లేదు అనిపించినా నేపధ్య సంగీతం విషయంలో చిరంతాన్ భట్ మెప్పించలేకపోయాడు. ఇక దర్శకుడు రవికుమార్ తీసుకున్న ప్రేమ , త్యాగం కధకి బాలయ్య హీరోయిజం జోడించడానికి ట్రై చేసి తప్పు చేసాడు. బాలయ్య ని నమ్ముకుంటే ఇంకా మంచి మాస్ కథ తీసుకుని వుండాల్సింది. కానీ కధలో వున్న ఔన్నత్యం మిగిలిన ఉప కధలు, యాక్షన్, డైలాగ్ ఎపిసోడ్స్ తో మారిపోయింది. దీంతో సినిమా అటు ఇటు కాకుండా అయ్యింది. అయినా బాలయ్య శక్తివంచన లేకుండా జైసింహా ని నిలబెట్టడానికి గట్టి ప్రయత్నం చేసాడు.

తెలుగు బులెట్ పంచ్ లైన్… ఫాన్స్ జై బాలయ్య అంటారేమో గానీ “జైసింహా” అనలేరు.
తెలుగు బులెట్ రేటింగ్… 2 .75 /5 .