‘జంబ లకిడి పంబ’ రివ్యూ… తెలుగు బులెట్

Jambalakidi Pamba Movie Review

న‌టీన‌టులు:    శ్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్, స‌త్యంరాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌
సంగీతం:        గోపీసుంద‌ర్‌
సినిమాటోగ్రఫి:  స‌తీశ్ ముత్యాల‌
ద‌ర్శ‌క‌త్వం:     జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)

1993లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్, ఆమని ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘జంబ లకిడి పంబ’ పెద్ద కామెడీ సెన్సేషన్. అదే పేరుతో తాజాగా శ్రీనివాసరెడ్డి మెయిన్ లీడ్ గా మరో ‘జంబ లకిడి పంబ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రాలలో ఈవీవీ వి‘చిత్రాలు’ వేరయా..! అని చెప్పడానికి ‘జంబ లకిడి పంబ’ సినిమా ఒక్కటి చాలు. ఈవీవీ ‘జంబ లకిడి పంబ’ లాంటి సినిమా మళ్లీ ఇప్పటి దాకా రాలేదు, రాదు కూడా. ‘జంబ లకిడి పంబ’ పాత టైటిల్‌ను వాడుకున్నా ఆ కథ, ఈ కొత్త సినిమాకి ఎలాంటి సంబంధంలేదని ముందే చెప్పారు చిత్ర దర్శకుడు. ట్రైలర్లు, ప్రోమోలు చూసిన ప్రేక్షకులు ఇంకొంచెం కొత్తగా ఉంటుందేమో అని ఊహించారు. మరి ఆ మేరకు ప్రేక్షకులని ఈ సినిమా అలరించిందా అనేది రివ్యూలో చూద్దాం.

కథ 

వరుణ్‌ (శ్రీనివాస్‌ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. పెళ్లి తరువాత అందరి భార్యా భర్తల మధ్య వచ్చే కామన్ మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక కలిసి జీవించలేమని నిర్ణయించుకున్న వరుణ్‌, పల్లవిలు విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్‌ లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ (పోసాని కృష్ణమురళీ) వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్‌ గా గిన్నిస్‌ రికార్డ్ సాధించాలనుకుంటాడు. కానీ వరుణ్‌, పల్లవికి విడాకులు రాకముందే హరిశ్చంద్ర ప్రసాద్‌ ఓ యాక్సిడెంట్‌లో భార్యతో సహా చనిపోతాడు. చేసిన పాపాల కారణంగా ఆత్మగా మారిన హరిశ్చంద్ర ప్రసాద్ భార్యకు దూరమవుతాడు. తిరిగి తన భార్యను కలుసుకోవాలంటే వరుణ్‌, పల్లవి లను ఒక్కటి చేయమని దేవుడు (సుమన్‌) కండిషన్ పెడతాడు. దీంతో తిరిగి భూమ్మీదకి వచ్చిన పోసాని వారిని కలపడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఇద్దరి ఆత్మలు ఎందుకు మారతాయి అనే అంశాన్ని దర్శకుడు మలిచిన తీరు బాగుంది.

విశ్లేషణ 

కమెడియన్‌గా క్లీన్ ఇమేజ్‌ ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. సినిమా మొత్తం తన నటనతో అలరించాడు, తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఒకరకంగా చాలా సీన్స్‌ లో శ్రీనివాస్‌ రెడ్డిని డామినేట్‌ చేసే ప్రయన్ట్నం చేశారు. ముఖ్యంగా జెండర్ చేంజ్ తరువాత వచ్చే సీన్స్‌ లో ఎంతో అనుభవం ఉన్న నటిలా చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో మెయిన్ గా చెప్పాల్సింది లాయర్ పాత్రధారి పోసాని కృష్ణమురళి గురించి 99 మందికి విడాకులు ఇప్పించి గిన్నిస్ బుక్‌లో రికార్డు కోసం 100వ జంటకు కూడా విడాకులు ఇప్పించాలని తాపత్రయపడే లాయర్ పాత్రలో పోసాని నటన బాగుంది. పోసాని తెర మీద కనపడినంత సేపు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, తనికెళ్ల భరణి, రఘుబాబు, హరితేజ తమ పాత్రల్లో బాగా నటించారు. షకలక శంకర్, జయప్రకాశ్ రెడ్డి పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. ఐటమ్ సాంగ్‌లో అలీ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోతాడు.

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బడ్జెట్లోనే మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. దర్శకుడిగా మను కష్టం తెర మీద కనపడుతోంది, ముఖ్యంగా రచయితగా ఆయన రాసిన డైలాగ్స్, పంచ్ లు మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులని కూడా అలరిస్తాయి. ఈ సినిమాలో కామెడితో పాటు ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు గోపీ సుందర్ గురించి ఆయన సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. మాస్ ఆడియన్స్ కోసం పెట్టిన ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ లో గోపీ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఈయనకు మాస్ సినిమాల్లో ఇంకా అవకాశం రాలేదు కానీ వస్తే మరో దేవి శ్రీ అవుతారేమో ! సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అనవసర సన్నివేశాలను కాస్త కత్తెర వేసుంటే సినిమా కాస్త ఆసక్తికరంగా ఉండేది.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ‘జంబ లకిడి పంబ’ నవ్వుల జడివాన
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5