Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లష్కరే తోయిబాలో చేరిన కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకుని పోలీసులకు లొంగిపోయాడు జమ్మూకాశ్మీర్ ఫుట్ బాల్ జట్టు సభ్యుడు మజీద్ ఇర్షాద్ ఖాన్. అనంత నాగ్ కు చెందిన మజీద్ మంచి విద్యావంతుడు, ప్రతిభావంతుడు. అయితే జమ్మూకాశ్మీర్ లో భద్రతాబలగాలు నిర్వహించిన ఓ ఎన్ కౌంటర్ లో మజీద్ స్నేహితుడు యశ్వర్ నిసర్ ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన మజీద్ ఉగ్రవాదం వైపు మళ్లాడు. నాలుగురోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత ఏకె 47తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు. తాను ఉగ్రవాదుల్లో కలిసానని, లష్కరే తోయిబాలో చేరానని ప్రకటించాడు. ఒక్కగానొక్క కుమారుడు కుటుంబాన్ని వదిలి ఉగ్రవాదంలో చేరడంతో మజీద్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. మజీద్ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆయన్ను వెనక్కి తిరిగి వచ్చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాశ్మీర్ అంతా పోస్టర్లు అతికించారు.
ఈ నేపథ్యంలో మజీద్ దక్షిణ కాశ్మీర్ లోని భద్రతా సిబ్బంది క్యాంప్ కు వెళ్లి లొంగిపోయాడని అధికారులు వెల్లడించారు. ఫుట్ బాల్ గోల్ కీపర్ అయిన మజీద్ స్నేహితుడి మరణంతో ఉగ్రవాదంపై మళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల్లో చేరిన తర్వాత మజీద్ కు కనువిప్పు కలిగినట్టు భావిస్తున్నారు. మజీద్ తండ్రి ప్రభుత్వోద్యోగి కాగా, తల్లి గృహిణి. భద్రతాబలగాలు, ఉగ్రవాదం మధ్య కాశ్మీరీ యువత నలిగిపోతున్నారనడానికి మజీద్ ఓ ఉదాహరణ. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన మజీద్ పైనే…లష్కరే తోయిబా ఇంతగా ప్రభావం చూపిందంటే…ఇక పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఉగ్రవాదసంస్థలు తమ వైపుకు ఎలా ఆకట్టుకుంటున్నాయో అర్దంచేసుకోవచ్చు. కాశ్మీరీ యువత కొందరు ఉగ్రవాద భావజాలనికి ఆకర్షితులై తప్పుదారి పడుతోంటే..మరికొందరు భద్రతాబలగాల తీరును వ్యతిరేకిస్తూ ఆయుధాలు పట్టుకుంటున్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు..తరచూ కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా… యువత దృష్టి ఉగ్రవాదం వైపు మరలకుండాచూడాలని పలువురు సూచిస్తున్నారు.