పవర్ స్టార్ ‘స్టామినా’ ఇంతేనా ?

Jana Sena another Schedule start from july 24

పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకూ సినిమా హీరో, అప్పట్లో అన్న చిరంజీవి ఒక పార్టీ పెడితే దానిలో ఒక విభాగం తీసుకుని రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసి దానిని గెలిపించదానికి ప్రయత్నాలు చేశారు, అవి విఫలమయ్యాయి అనుకోండి అది వేరే విషయం. తర్వాత 2014 ఎన్నికల ముందు జనసేన అంటూ ఒక రాజకీయ పతి స్థాపించి అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసమే అంటూ టీడీపీ-బీజేపీల కూటమికి మద్దతిచ్చి ఊరుకున్నాడు. ఏమయిందో ఏమో టీడీపీ బీజేపీ నుండి బయటకి వచ్చే సమయానికి తానూ మద్దతు ఉపసంహరించి ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టాడు. కానీ 2017 నాటి పరిస్థితులు పరిశీలిస్తే ప్రజల భావోద్వేగాలతో ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం నాకిష్టం లేదు. అసలు నాకు సీఎం అవ్వాలని లేదు. సీఎం అయితేనే సమస్యలు పరిష్కరించగలమనే వాదనను నేను ఒప్పుకోను. రాష్ట్ర అభివృద్ది చేయడం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి పనిచేయడమే నేను చేయాల్సిన పని అని జనసేనాధిపతి పవన్ చెప్పిన మాటలు. కానీ సంవత్సరం, తేదీ మారినట్లుగానే ఆయన మాటల్లో కూడా తేడా వచ్చింది. మమ్మల్ని గెలిపించండి. సీఎంని చేస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తారు. టిడిపి ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోంది.. ఇవి 2018 వచ్చేనాటికి పవన్ నోటి వెంట వస్తున్న మాటలు.

అసలు పవన్ ధోరణిని పరిశీలిస్తే ప్రత్యర్థి నాయకులు విమర్శిస్తున్నట్లుగా, పవన్ రాజకీయాలకు పనికి రాడా ? అన్న బాటలోనే దెబ్బ పడ్డాక మళ్లీ సినిమాలు చేసుకునే సమయం దగ్గర్లోనే ఉందా ? వచ్చే ఎన్నికల్లో పట్టుమని పది సీట్లు కూడా గెలిచే సత్తా జనసేనకు లేదా ? అజ్ఞాతవాసి కన్నా దారుణంగా జనసేన పార్టీకి శుభం కార్డు పడబోతుందా..? అనే అనుమానాలు తప్పకుండా కలుగుతాయి. ఉత్తరాంధ్రలో వరుస పెట్టి 45 రోజుల పాటు ప్రజాసమస్యలపై పర్యటిస్తానని చెప్పిన పవన్, పర్యటనను ఎక్కడికక్కడే ఆపేస్తూ బ్రేకుల మీద బ్రేకులు ఇస్తున్నారు.కంటిన్యూగా ప్రజాపోరాట యాత్రను కొనసాగించలేకపోతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశకు గురవడంతో పాటు,పవన్ రాజకీయాలపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పర్యటనలో ఉండగానే వ్యక్తిగత సిబ్బందికి దెబ్బలు తగిలాయని కొన్ని రోజులు రిసార్ట్ కు పరిమితం అయిపోయారు. తర్వాత ఓ రెండు రోజుల పాటు కొనసాగించి తన భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారని చెప్పి ‘రంజాన్’ సెలవులు ప్రకటించేశారు.

తర్వాత ఎప్పటికో మరలా ఒక షెడ్యుల్ ప్రకటించి వాయిదా వేసి మరలా ఎప్పటికో ప్రారంబించారు. అయితే పవన్ కి ఈ మధ్య కంటి సర్జరీ ఒకటి చేశారు. అసలు పవన్ కి ప్రజల్లో తిరగడానికి సహనం ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సుకుమారుడులా పెరిగిన జగనే దాదాపు ఏడాది నుండి పాదయత్ర చేస్తున్నాడు , అంతకు నుందు ఏడాదిన్నర పాటు చంద్రబాబు పాదయాత్ర చేసాడు కానీ పవన్ యాత్ర అందునా బస్సు యాత్ర కూడా చేయలేకపోతున్నాడు అనే భావన ప్రజల్లోకి వెళితే మొదటికే మోసం వస్తుంది. 2014 ఎన్నికలముందు ఎన్నో అంచనాల మధ్య స్థాపించబడ్డ జనసేన పార్టీ, 2019 ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా నిలదొక్కుకోలేకపోతుంది. ఆ పార్టీలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. పార్టీ అధికార ప్రతినిధులుగా పదిమందిని నియమించినప్పటికీ, వారిలో ఏ ఒక్కరికీ ప్రజాదరణ లేదు. పవన్ తన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకులను ఆకర్షించటంలో కూడా ఇంత వరకూ సక్సెస్ కాలేదు. ఇవన్నీ చూస్తుంటే, అసలు పవన్ ఉద్దేశ్యం ఏంటా అన్న అనుమానం రేకెత్తుతోంది. అయితే ఈ నెల 24 నుండి మరో షెడ్యుల్ అని ప్రకటించిన పవన్ ఈసారి అయినా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారా ? అనేది వేచి చూడాలి.