Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జయ మేనకోడలు దీపా జయకుమార్ 4 రోజులుగా అదృశ్యం అయ్యారన్న విషయం చెన్నైని కుదిపేస్తోంది. అంతకుముందు ఈమె గురించి ఎవరికీ తెలియదు. జయ ఆస్పత్రి లో వున్నప్పుడు తొలిసారిగా ఆమె అపోలో ఆస్పత్రి వద్ద హడావిడి చేశారు. జయ మరణం తర్వాత శశికళ మీద దీప విరుచుకుపడ్డారు. సొంత పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టారు. ఒక దశలో పన్నీర్ సెల్వం తో ఆమె కలిసిపోతారని కూడా అనిపించింది. కానీ ఏమీ జరగలేదు. జయ పోలికలు ఉండటం అనే ఒక్క పాయింట్ ని అడ్డం పెట్టుకుని దీప రాజకీయాల్లో తన ముద్ర వేయడానికి ఎప్పుడైతే ప్రయత్నాలు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంలో సమస్యలు వున్న విషయం కూడా బయటికి వచ్చింది. భర్త మాధవన్ తో ఆమెకి విభేదాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ గొడవలు వల్ల జయ రాజకీయ భవితవ్యం దెబ్బ తినకుండా ఇద్దరూ ఒకటి అయ్యారు.
దీపా, మాధవన్ ఒకే ఇంటిలో ఉంటున్నప్పటికీ వారి మధ్య పార్టీ వ్యవహారాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. అయితే ఈ విషయం తమిళ రాజకీయ అనిశ్చితి నడుమ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఉన్నట్టుండి ఈ మధ్య తనని దీప కారు డ్రైవర్ బెదిరిస్తున్నాడని ఆమె భర్త మాధవన్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఇంటి రచ్చ బజారున పడింది. దీపా కారు డ్రైవర్ తో తనకి ముప్పు ఉందని మాధవన్ ఫిర్యాదు మీద పోలీసులు నాలుగు రోజుల కిందట ఆమెని కూడా విచారించారు. అయితే మాధవన్ ని బెదిరించ లేదని ఆమె వారికి వివరించారు. ఆ తర్వాత నుంచి దీపా కనిపించడం లేదు. ఆమె స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్ళారా లేక దంపతుల మధ్య గొడవ ఏదైనా అనుకోని ఘటనకు దారి తీసిందా లేక దీప కుటుంబంలో వున్న గొడవల్ని సాకుగా తీసుకుని ఆమెని రాజకీయ ప్రత్యర్ధులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ? . ఇన్ని కోణాల నుంచి తమిళ ప్రజలు దీప గురించి ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఆమె బయటికి వచ్చే దాకా ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.