శిఖా చౌదరి బెదిరింపులు…జయరాం మామ ఫిర్యాదు!

Jayaram Father In Law Files Complaint On Shikha Chowdhary

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ క్రైం థ్రిల్లర్ సీరియల్ లా సాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అతడి దందాలు, కబ్జాల గురించి విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, ఈ కేసు సోమవారం ఆసక్తికర మలుపు తిరిగింది. జయరాం మేనకోడలు శిఖాచౌదరితో తమకు ప్రాణహాని ఉందని ఆయన మామ పిచ్చయ్య చౌదరి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిఖాతోపాటు మరి కొందరు తమను బెదిరిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త హత్య కేసులో శిఖాచౌదరి పాత్రపై తనకు అనుమానాలున్నాయంటూ ఇప్పటికే జయరాం సతీమణి పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణాకు బదిలీ చేయాలని ఆమె కోరారు.

అయితే కేసు బదిలీ నేపథ్యంలో పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు ఇక్కడ నమోదు కాలేదు. ఆమె రెండు రోజుల కిందట అమెరికాకు వెళ్లిపోవడంతో పద్మశ్రీ చేసిన ఆరోపణలపై తండ్రి పిచ్చయ్యచౌదరి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. జయరాం హత్య తర్వాత శిఖా చౌదరి ఆయన ఇంట్లో, ఫిలింనగర్‌లోని కార్యాలయంలో విలువైన పత్రాలను తస్కరించినట్టు అందులో పేర్కొన్నారు. పిచ్చయ్య చౌదరి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. కాగా, శిఖా చౌదరి మాత్రం జయరాం ఆఫీసు నుంచి ఎలాంటి పత్రాలు తీసుకెళ్లలేదని విచారణలో తేలినా ఆధారాల కోసం సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

అయితే, జయరాం ఇంట్లో నుంచి తీసుకెళ్లిన పత్రాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి‌తోపాటు అతడి స్నేహితుడికి కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాకు సుభాష్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. హత్య విషయాన్ని ముందు సుభాష్‌ రెడ్డికి తెలిపిన రాకేశ్, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అతడికి వాట్సాప్‌లో పంపినట్లు సమాచారం. దీనిపై కూడా పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో సుభాష్‌రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా చూపే అవకాశాలున్నాయి. మరో వైపు ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నట్లు గుర్తించిన పోలీసులు పత్రాలు అంజిరెడ్డి అనే వ్యక్తి వద్ద ఉన్నట్లు గుర్తించారు. అతడ్ని విచారించాల్సి ఉంది.