తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులకు హైకోర్టు షాకిచ్చింది. తమపై జరుగుతున్న విచారణను నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డీఎస్పీ ఎస్ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీనివాసులు, ఎం.రాంబాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది.
జయరామ్ హత్య జరగబోతున్నట్లు ముందే తెలిసినా, వీరు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసు శాఖ వీరిని విధుల నుంచి తప్పి విచారణకు ఆదేశించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో పోలీసు శాఖ దర్యాప్తు చేయడం చట్టవిరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. జయరామ్ హత్యకేసులో ఎంతోమంది సాక్షులున్నారని, అలానే ఈ ముగ్గురు అధికారుల పాత్ర కూడా స్పష్టంగా ఉందని పేర్కొంది అందువల్ల వారి పిటిషన్ను స్వీకరించలేమని, ఆ అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.