జేసీ సంచలన ప్రకటన !

jc-diwakar-reddy-sensational-announcement

జేసీ దివాకర రెడ్డి…ఈ పేరే సంచలనం అనాలేమో ఎందుకంటే ఆయన చేసే వ్యాఖ్యలు అలాంటివి. ఎల్లప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ప్రకటించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని అన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని తెలిపారు.

పదవులు వస్తున్నకొద్దీ హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేయడం న్యాయమా అని జేసీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్, పవన్ కళ్యాణ్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన తనయుడు పవన్‌రెడ్డి నిలబడతారనే ప్రచారం జోరుగా సాగిఇంది. ఈ విషయంలో ఎంపీ జేసీ కూడా క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో పవన్‌రెడ్డి జెట్‌ స్పీడుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. స్విడ్జర్లాండు, జెనీవాలో ఎంబీఏ చదువుకున్న ఆయన హైదరాబాద్‌లో సినిమా ప్రముఖులు, క్రికెటర్లతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి.కానీ ఇవన్నీ పకనపెట్టిన ఆయన కొంతకాలంగా అనంతపురంపై దృష్టి సారించారు. నగరంలోని ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఇప్పుడు జేసీ రాజకీయ విరమణ ప్రకటన ఇప్పుడు పవన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తోంది.