జేడీ రాయబారంతో లక్ష్మీపార్వతి ఎస్ చెప్పిందా ?

JD Chakravarthy Main Reason For The Laxmi's NTR Biopic Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

” లక్ష్మీస్ ఎన్టీఆర్ “… సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాల్లో వేడి పుట్టిస్తున్న టాపిక్. బాలయ్య తనకు ఎన్టీఆర్ బయోపిక్ ఇవ్వడం లేదన్న కోపంతో వర్మ ఈ సినిమా మొదలుపెడుతున్నాడన్న దానిపై చాలా మందికి క్లారిటీ వుంది. అయితే వర్మ టాపిక్ ఏ సందర్భంలో వచ్చినా అతన్ని దారి తప్పిన మేధావిగా అభివర్ణించే లక్ష్మీపార్వతి ఈ సినిమాకి ఒప్పుకోవడం మాత్రం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎన్టీఆర్ బయోపిక్ కి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు వర్మ ప్రకటించగానే లక్ష్మీపార్వతి ఇంతెత్తున లేచింది. టీవీ ఛానెల్స్ సాక్షిగా వర్మని ఏకేసింది. ఎన్టీఆర్ సినిమా తీయడానికి ఆయన అర్హతని ప్రశ్నించింది. డబ్బు కోసం బాలయ్య, చంద్రబాబు చేస్తున్న కుట్రలో వర్మ పావుగా ఉపయోగపడుతున్నాడని వాదించింది.

ఓ రెండు నెలలు గడిచేసరికి సీన్ అంతా మారిపోయింది. తనని ఏకిపారేసిన లక్ష్మీపార్వతిని కేంద్రబిందువుగా చేసుకుని సినిమా తీయడానికి వర్మ రెడీ అయిపోయాడు. ఇక ఆయన తరపు మనుషులు కొందరు తనని కలిసి ఈ సినిమా తీయడానికి అనుమతి కోరడం తో పాటు కొన్ని విషయాలు తన నుంచి తెలుసుకున్నట్టు లక్ష్మీపార్వతి ప్రకటించారు. ఈ ఒక్క విషయం చాలు సినిమా విషయంలో వర్మ ఏ స్థాయిలో వర్క్ అవుట్ చేస్తాడో చెప్పడానికి. మాములుగా అయితే ఇలాంటి బయోపిక్ తీస్తున్నప్పుడు వర్మ స్వయంగా సంబంధిత వ్యక్తుల్ని కలుస్తారు. రక్త చరిత్ర టైం లో పరిటాల సునీత, సూరి తో వర్మ భేటీ గురించి అప్పట్లో కధలు కధలుగా చెప్పుకున్నారు. ఇక వంగవీటి సినిమా తీస్తున్నప్పుడు అయిన రచ్చ తెలిసిందే. దేవినేని నెహ్రు, వంగవీటి కుటుంబంతో వర్మ చర్చలు , రిలీజ్ సమయంలో అయిన గొడవలు అందరికీ తెలిసిందే. కానీ ఈసారి సీన్ లో వర్మ కనిపించలేదు. కానీ ఆయన తరపున లక్ష్మీపార్వతి దగ్గరికి వెళ్లి ఈ పని ఎవరు చక్కబెట్టుకువచ్చారు అన్న ప్రశ్న ఇప్పుడు చాలా చాలా మందిలో ఉదయిస్తోంది.

ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుతుంటే ఆశ్చర్యకరమైన పేరు బయటికి వచ్చింది. వర్మ లాగే కాస్త టెంపర్ ఎక్కువగానే వుండే ఆయన శిష్యుడు జేడీ చక్రవర్తి గురువు తరపున కావాల్సిన దౌత్యం నెరిపారంట. కాస్త దూకుడుగా కనిపించే జేడీ ని వర్మ ఈ పనికి ఎంచుకోవడమే ఆశ్చర్యం. అయితే దాన్ని పక్కాగా పూర్తి చేసుకొచ్చి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు జేడీ. “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” పేరుతో తీస్తున్న సినిమాలో అప్పటి ఆగష్టు సంక్షోభం సహా నందమూరి కుటుంబ వ్యవహారాల పై లక్మిపార్వతి వాదన బలంగా వినిపిస్తామని జేడీ చెప్పడంతో ఆమె కూల్ అయ్యారట. అందుకే తనకు తెలిసిన సమాచారం జేడీ కి చెప్పడంతో పాటు వర్మ గురించి నెగటివ్ గా మాట్లాడలేదు. ఆ ఒప్పందంలో భాగంగానో ఏమో లక్ష్మీపార్వతి దగ్గర ఏదో టాలెంట్ లేకపోతే ఎన్టీఆర్ ఆమెకి ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చి ఉంటారని వర్మ ప్రశ్నిస్తున్నారు. ఇటు తాను అనుకున్న విషయంలో ఒక్క అడుగు వెనక్కి వేయడానికి కూడా ఇష్టపడని వర్మ, అటు ఎన్టీఆర్ విషయంలో తన తప్పేమీ లేదని వాదించే లక్ష్మీపార్వతి ని ఒక్క మాట మీదకి తీసుకురావడంలో జేడీ సమయస్ఫూర్తిని మెచ్చుకోవాల్సిందే. ఇంతకీ జేడీ ఇంత రిస్క్ ఎందుకు చేసాడు? గురువు కోసమేనా అనుకుంటే అంతకు మించిన విషయం ఉందని తెలుస్తోంది. అది …ఈ సినిమాకి జేడీ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదట. అదండీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మ్యాటర్ లో కొసమెరుపు.