ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉక్క పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్‌ను మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ, నిర్మాత బండ్ల గణేశ్ పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా ఉక్కుదీక్షను కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ పది రోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఉదయం రమేష్‌కు వైద్య పరీక్షలు చేసిన రిమ్స్ వైద్యులు ఆయనకు బీపీ, షుగర్ లెవల్స్ బాగా తగ్గాయని తెలిపారు.
సీఎం రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు ఎంపీ రమేష్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ సిఎం రమేష్ సతీమణి మాత్రం తన భర్తకే సపోర్ట్ చేస్తున్నారు. సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ, ఆయన గుండె, లివర్, ఊపిరితిత్తులపైన ఎంత ప్రభావం పడుతున్నదో వైద్యులు వివరించి చెప్పినప్పుడు ఆయన భార్యగా నేను, మా పిల్లలు, కుటుంబంలోని అందరం చాలా ఒత్తిడికి గురయ్యాం. వైద్యులు చెప్పినప్పటి నుంచి భయమేస్తోంది. ఆయన పట్టుదల రోజురోజుకీ పెరుగుతోందే కానీ, ఆయన ఏమాత్రం భయపడట్లేదు. ఆ పట్టుదల చూసినప్పుడు పోరాడేందుకు భగవంతుడు ఆయనకు ఇంకా శక్తి నిస్తాడని అనిపిస్తోంది. దేవుడిని మేము ప్రార్థించేది కూడా అదే’ అని అన్నారు.