కీలక స్థానాల్లో భారతీయులు

కీలక స్థానాల్లో భారతీయులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇద్దరు ప్రముఖ భారతీయ–అమెరికన్‌ వైద్యులను తన ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక స్థానాల్లో నియమించారు. వెస్ట్‌ వర్జీనియా మాజీ హెల్త్‌ కమిషనర్‌ డాక్టర్‌ రాహుల్‌ గుప్తాను ‘ఆఫీసు ఆఫ్‌ ద నేషనల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ పాలసీ’ తదుపరి డైరెక్టర్‌గా నామినేట్‌ చేశారు. ప్రఖ్యాత సర్జన్, రచయిత అతుల్‌ గవాండేను యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో ‘బ్యూరో ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు.

రాహుల్‌ గుప్తా వెస్టు వర్జీనియాలో ఇద్దరు గవర్నర్ల హయాంలో హెల్త్‌ కమిషనర్‌గా సేవలందించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ప్రజారోగ్య పాలసీపై పలు సంస్థలు, టాస్క్‌ఫోర్సులకు సలహాదారుడిగా పనిచేశారు. భారత దౌత్యవేత్త కమారుడైన డాక్టర్‌ రాహుల్‌ గుప్తా భారత్‌లో జన్మించారు. వాషింగ్టన్‌ డీసీలో పెరిగారు.

ఇక అతుల్‌ గవాండే రాసిన ద చెక్‌లిస్టు మేనిఫెస్టో, బీయింగ్‌ మోర్టల్, కాంప్లికేషన్స్‌ తదితర పుస్తకాలు న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్టు–సెల్లింగ్‌ బుక్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘బ్యూరో ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా తనను నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అతుల్‌ గవాండే చెప్పారు.