ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో పుతిన్ బలగాలు మారణహోమానికి పాల్పడ్డాయని బైడెన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు బైడెన్ ఆరోపించారు.అంతర్జాతీయంగా రష్యా వ్యవహారశైలి ఎలా ఉందన్న దానిపై లాయర్లు నిర్ణయిస్తారని, అక్కడ ఊచకోత జరగుతున్నట్లు అనిపిస్తోందని బైడెన్ తెలిపారు.
ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం పాల్పడిన అకృత్యాలకు సంబంధించిన భయానక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని బైడెన్ అన్నారు. ఓడరేవు నగరమైన మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా తీవ్ర దాడులు చేస్తున్నదని విమర్శించారు. ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యన్ సేనలు బాంబు దాడులు చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా ‘నరమేధం’ సృష్టిస్తోందని అన్నారు.
బైడెన్ అయోవాలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై యుద్దంలో భాగంగా రష్యా.. రసాయన ఆయుధాలను ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఉక్రేనియన్లు ఉండకూడదనే లక్ష్యంతోనే పుతిన్ దాడులు కొనసాగిస్తున్నారని అన్నారు. రష్యా బలగాలు ‘జాతి హత్య’కు పాల్పడుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కూడా బైడెన్.. పుతిన్‌ను యుద్ధ నేరస్తుడు అంటూ అభివర్ణించాడు.
కాగా, బైడెన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందిస్తూ.. జాతి హత్య అనే వ్యాఖ్య సరైనదేనని అన్నారు. తమ దేశ పౌరులను చంపడమే లక్ష్యంగా పుతిన్ బలగాలు దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు జరిపిన దాడుల్లో వేల సంఖ్యలో ఉక్రేనియన్లు మరణించారని తెలిపారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తమకు భారీ ఆయుధాలను పంపించాలని మరోసారి అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అంతకు ముందు పుతిన్ మాట్లాడుతూ..పాశ్చాత్య దేశాల ఆంక్షల దాడిని రష్యా విజయవంతంగా తట్టుకుందని అన్నారు. సైనిక చర్య ప్రణాళిక మేరకు సాగుతోందని, లక్ష్యం సాధించే దాకా యుద్ధం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ వెనకడుగు వేయడం వల్లే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంత ప్రజలను కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.