నటుడు, బిగ్‌బాస్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణంతో బీటౌన్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై నెటిజన్లు సహా బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ నటుడు, డబ్ల్యూడబ్ల్యూఈ వ్రిస్ట్‌లర్ జాన్ సెనా సిద్ధార్థ్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.
డబ్ల్యూడబ్ల్యూఈ ఫాలో అయ్యేవారికి జాన్‌సేనా ఎవరో తెలిసే ఉంటుంది. అంతేకాకుండా 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ నిలవడమే కాకుండా ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించి జాన్సెనా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇటీవలె తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సిద్ధార్థ్ శుక్లా ఫోటో షేర్‌చేసి సంతాపం తెలిపాడు. అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, శ్రద్ధా ఆర్య వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆ ఫోటోని లైక్ చేశారు.
ప్రస్తుతం జాన్సెనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హాలీవుడ్ నటుడు సిద్ధార్థ్‌కు సంతాపం వ్యక్తం చేయడంపై అతని అభిమానులు జాన్సెనాపై ప్రశంసలు కురిపించారు. ఈ పోస్ట్‌కు సిద్ధార్థ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్ల వర్షం కురుస్తుంది. తమ అభిమాన నటుడికి శాశ్వతంగా గుడ్ బై చెబుతూ పలువురు నెటిజన్లు సంతాపం తెలిపారు.