సైదాబాద్ రాజుని పోలీసులే చంపారు

సైదాబాద్ రాజుని పోలీసులే చంపారు

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారిపై హత్యాచార కేసు నిందితుడు పల్లికొండ రాజు మరణంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుడి మరణంపై జ్యుడీషియల్ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. విచారణ జరిపి నాలుగు వారాల్లోగా సీల్డ్ కవర్‌లో నివేదిక అందించాలని మేజిస్ట్రేట్‌కి ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్2కి విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడు పల్లికొండ రాజుని పోలీసులే చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అత్యవసర విచారణకు అభ్యర్థించడంతో ఈరోజు మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టింది. నిందితుడు రాజుని పోలీసులే చంపేసి ఆత్మహత్యగా చెబుతున్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు.

నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజు ఆత్మహత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని.. వారి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. పోస్టుమార్టం వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జడ్జికి అందజేయాలని ఆదేశాలిచ్చింది.