సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ గొగొయ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగొయ్ 2019 నవంబరు 17 వరకు 13 నెలల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం అక్టోబరు 2తో ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ గగోయ్‌ను నియమించారు.
సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సీజేఐగా సిఫార్సు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్ గొగొయ్ పేరును జస్టిస్ దీపక్ మిశ్రా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపడంతో జస్టిస్ గొగొయ్ సీజేఐగా నేడు బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ గొగోయ్ ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు.1978లో అసోం(అప్పటి అస్సాం) బార్ అసోసియేషన్ లో చేరారు. 2001, ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టులో శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 2009, సెప్టెంబర్ 10న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరుసటి ఏడాది అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.