కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య- జ్యోతిక జంట ఒకటి. సూర్య-జ్యోతికలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అంతేగాక తమ సొంతబ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లేడీ బాస్‌గా వ్యవహరిస్తున్నారు. భర్త సూర్యతో కలిసి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న జ్యోతిక పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె సూర్య గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఓ నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫాం, సౌత్ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఈ మేరకు జ్యోతిక, సూర్య గురించి చెబుతూ.. ‘సూర్య చాలా రొమాంటి భర్త. నన్నూ పిల్లలను బాగా చూసుకుంటాడు. భార్య మాటకు విలువ ఇస్తాడు. ప్రొడక్షన్ హౌజ్‌లో నా భాగస్వామ్యాన్ని, సినిమాల పరంగా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇక ఉదయాన్నే నాతో కలిసి కాఫీ తాగుతారు. మా ఇద్దరికి ఔట్‌డోర్ జాగింగ్ అంటే ఇష్టం. సూర్య కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇవి సూర్యలో ఉంటే బెస్ట్ క్వాలిటీస్. అందుకే ఆయనను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. సూర్యకు ఉన్న లేడీ ఫాలోయింగ్ చూస్తుంటే నాకు కొంచం టెన్షన్‌గా ఉటుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే తను సూర్య కథల గురించి చాలా మాట్లాడుకుంటామని, ఎందుకంటే గట్టిగా చర్చించుకున్నప్పుడే కథలో ఉన్న దమ్ము బయటపడుతుందన్నారు. స్క్రిప్ట్ విషయంలో సూర్య అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరని, తాను మాత్రం కథ వినగానే కొత్తగా ఉందా లేదా అని చూస్తానన్నారు. చాలా వరకు ఫైనల్‌గా తను చెప్పిన మాటకే అందరూ ఓటు వేస్తారని జ్యోతిక పేర్కొన్నారు. ప్రస్తుతం తమ బ్యానర్‌లో పదిహేను సినిమాలు రూపొందుతున్నాయని, వాటిలో కొన్ని థియేటర్లలో మరికొన్ని ఓటీటీలకు సరిపోయే కథలు ఉన్నాయని చెప్పారు.