నేడే కాళేశ్వరం ప్రారంభం…ముఖ్య అతిధులుగా జగన్, ఫడ్నవీస్

Kaaleshwaram inaugration today

కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నేటితో నెరవేరబోతోంది. తెలంగాణ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును మరికాసేపట్లో కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 8:15 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని హోమంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం 10:50కి కన్నెపల్లి చేరుకొంటారు. 11.40కి పంపుహౌస్‌ను ప్రారంభిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఆయన మేడిగడ్డ చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు కన్నెపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి అమరావతి బయలుదేరుతారు. ఇక, ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 9:55కు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపు హౌస్‌కి చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం కేసీఆర్ మేడిగడ్డ బరాజ్‌తో పాటు కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటిని విడుదల చేయనుండగా.. మిగతా కీలక నిర్మాణాల వద్ద రాష్ట్ర మంత్రులు పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే పలువురు మంత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. అన్నారం పంపుహౌస్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి, సుందిల్ల పంపుహౌజ్ వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్యాకేజీ- 6లో భాగంగా నందిమేడారం పంపుహౌస్లో కి మంత్రి మల్లారెడ్డి, ప్యాకేజీ-8లో భాగంగా రామడుగు పంపుహౌస్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి పూజలు చేస్తారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నెపల్లి పంపుహౌస్ వద్ద పూజలో పాల్గొంటారు. చివరగా కన్నెపల్లి పంపుహౌస్ వద్ద అతిథులతో కలిసి భోజనాలు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన కన్నెపల్లి గ్రామస్థులకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. అతిథుల రాకపోకల కోసం 17 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు.